అధికార పార్టీలో సోషల్ మీడియా వార్..ఆ మంత్రి వైపే అందరి చూపు

అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ మాజీ మంత్రి వైపు అన్ని వర్గాలు మళ్లీ చూస్తున్నాయి. జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆయనంటే గిట్టని వర్గాలకు మాత్రం జరుగుతున్న పరిణామాలు రుచించలేదు. మాజీ మంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాను వాడేసుకోవడం మొదలుపెట్టాయి. అయితే ఈ ప్రచారాల వెనక ఓ మంత్రి హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీలో జరుగుతున్న ప్రచారాలు ఇప్పుడు పోలీసు లకు పిర్యాదు చేసే స్థాయికి వెళ్లాయి. ఖమ్మం జిల్లా రాజకీయాలపై చర్చకు వస్తే అందులో తప్పకుండా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ్మల కంటూ ఒక గుర్తింపు.. అనుచరులు బలం దండిగానే ఉందనేది ఈ జిల్లాలో వినిపించే టాక్‌. 2018 ఎన్నికల్లో ఓడిన తర్వాత కొంత కాలం స్తబ్ధుగా ఉండిపోయారు తుమ్మల. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కొందరు రాజకీయాలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఓ మంత్రి చురుకుగా పనిచేశారన్నది పార్టీలో బహిరంగ రహస్యం.

రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు.. జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి. తుమ్మలను చురుకైన పాత్ర పోషించాలని అధికారపార్టీ పెద్దలు కోరడంతో రాజకీయ సందడి మొదలైంది. హెలికాప్టర్‌లో వచ్చిన ఇద్దరు మంత్రులు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన్ని తీసుకెళ్లారు. మాజీ మంత్రి పుట్టిన రోజు వేడుకలు సైతం జిల్లాలో ఓ రేంజ్‌లో నిర్వహించారు. జిల్లాలో బలమైన సామాజికవర్గం మొత్తం తుమ్మల వెంటే ఉందని చెప్పేలా కార్యక్రమాలు జరిగాయని అనుకుంటున్నారు. జిల్లా రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలోనే తుమ్మలపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు కలకలం రేపాయి.

ఖమ్మం జిల్లాలో కొందరికి ఒక్కసారిగా ఆయాచితంగా పదవులు వచ్చాయని, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి తుమ్మల ఆరోపిస్తున్నారు. ఇవి పరోక్షంగా అజయ్ కుమార్ పై దాడి చేసినట్లుగా ఉంది. పేర్లు పెట్టకుండానే తుమ్మల చేసిన వ్యాఖ్యలు సూటిగా అజయ్ ను తాకుతూనే ఉన్నాయి. గత రెండురోజులుగా తుమ్మల నాగేశ్వరరావు బిజెపి వైపు చూస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనికి తోడుగా తుమ్మల ప్రత్యర్దులు కొంత మంది దీనిని ఇంక ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ చేస్తున్నారు. ఇది తుమ్మల నాగేశ్వరరావుకు మనస్థాపానికి గురి చేసింది. దీంతో తుమ్మల డైరెక్టర్ గా తన మీద జరుగుతున్న ప్రచారంపై పోలీసు కమీషనర్ కు పిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు అధికార పార్టీలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.

తుమ్మలకు ప్రాధాన్యత పెరుగుతు వస్తున్న క్రమంలో ఆయన పార్టీ వీడుతున్నారంటూ పార్టీలో ఒక్కవర్గం ప్రచారం చేస్తుందని తుమ్మల వర్గం ఆరోపిస్తుంది. తనపై వస్తున్న దుష్పచారంపై చర్యలను తీసుకోవాలని, టిఆర్‌ఎస్ పార్టీ లో పని చేస్తున్న వారే ఈపనులు చేస్తున్నారంటూ తుమ్మల డైరెక్ట్ గానే కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తల పేర్లతో పోలీసులకు పిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.