మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యలపై బీజేపీ మహార్యాలీ నిర్వహించింది. ఈ మహార్యాలీలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్
రెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటుచేసిన సభలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంటున్న డబ్బును మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పేరుమీద పంపిణీ చేస్తోందని ఆరోపించారు. ‘ ప్రజల సొమ్ముతో కేసీఆర్10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కై పార్టీ కార్యాలయాలకు జాగలిస్తడు. కానీ పాలమూరులో ఉన్న పేదలకు ఇళ్లు కట్టడు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప బీఆర్ఎస్సర్కారుకు పేదలకు రేషన్ కార్డులిచ్చే సోయి లేదు. దళితులకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠంపై కూర్చున్న ఘనత కేసీఆర్ దీ. తొమ్మిదేండ్లలో ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదు. 30 లక్షల మంది యువత ఆకలిమంటల్లో ఉన్నరు. పేపర్ లీక్ తో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారు’ అని కిషన్రెడ్డి వాపోయారు.
‘రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీ ఏమైంది? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు. అప్పులు కట్టలేక డిపాల్టర్ గా మారటం వల్ల రైతులకు అప్పు పుట్టడం లేదు. బంగారు తెలంగాణ దేవుడెరుగు, కానీ కేసీఆర్ కుటుంబం బంగారమైంది. తెలంగాణలో అభివృద్ది కుంటుపడింది. రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా.. అప్పుల తెలంగాణగా మార్చిండు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబపార్టీలు. ఈమూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే’ అని కిషన్రెడ్డి తెలిపారు.