ఎయిర్​పోర్టు ఏర్పాటుకు సహకరించండి.. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సాంకేతిక, భూ పరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్‌, జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌), వరంగల్‌ విమానాశ్రయాల నిర్మాణానికి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్‌పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవరకద్ర (మహబూబ్‌ నగర్‌), మామునూరు (వరంగల్‌), బసంత్‌నగర్‌ (పెద్దపల్లి), ఆదిలాబాద్‌ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చేపట్టిన ఓఎల్‌ఎస్‌ సర్వే, భూపరీక్ష, టెక్నో-ఎకనమిక్‌ ఫీజిబిలిటీ స్టడీ (టీఈఎఫ్‌ఎస్‌) తర్వాత ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు పౌరవిమానయాన శాఖ ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

ప్రతిపాదిత విమానాశ్రయాలను అభివృద్ధి చేసి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ఇవ్వమని కోరితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా.. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగడం హాస్యాస్పదమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news