తెలుగు రాష్ట్రాల ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైనదని అన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
‘‘ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజలు ఉగాది పర్వదినం సందర్భంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించి.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలి. ఈరోజు నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శనశాలగా మారుస్తున్నాం. దీన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 11నెలల పాటు రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ నెల తప్ప మిగతా రోజుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండదు’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.