అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన కింగ్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కింగ్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. నిన్నటి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ వీరవిహారం చేశాడు. కోహ్లీ ఓపెనింగ్‌పై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘అఫ్గాన్‌పై కోహ్లీ ఓపెనర్‌గా ఎలా ఆడాడో చూశాం.. అలాగే భారత టీ20 టోర్నీలో కూడా అతడు బాగా రాణించాడు.. ఈ నేపథ్యంలో టీ20ల్లో విరాట్‌ను రెగ్యులర్ ఓపెనర్‌గా చూడొచ్చా?’ అని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించాడు. దీనికి రాహుల్ కాస్త అసహనంగా..‘అయితే ఏంటీ? నేను ఖాళీగా కూర్చోవాలా?’ అని సమాధానమివ్వడం గమనార్హం. ‘కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమ్‌ఇండియాకు నిజంగా శుభపరిణామం. ఈ మ్యాచ్‌లో ఆడిన తీరుతో అతడు చాలా సంతోషిస్తున్నాడని నాకు తెలుసు. అయితే, మూడో స్థానంలోనూ అతడు సెంచరీలు సాధించగలడు’ అని రాహుల్ వివరించాడు.
అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి (122 నాటౌట్; 61 బంతుల్లో 12×4, 6×6) టీ20ల్లో తన తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. ఇక భారత టీ20 టోర్నీలో బెంగళూరు తరఫున విరాట్ 5 శతకాలు సాధించగా.. అవన్నీ ఓపెనర్‌గా చేసినవే కావడం గమనార్హం.