చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా నిప్పులు చెరిగారు. టీడీపీకి 18 సీట్లు, జనసేనకి ఒక సీటు మాత్రమే వస్తుందన్నారు. ఆ ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొడాలి నాని. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని అన్నారు.
చంద్రబాబు 18 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని ఆశగా ఉంది. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా పట్టుకోలేరు అని కొడాలి నాని అన్నారు. అందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవటానికి జనసేన కార్యకర్తలు తన్నులు తిన్నా పర్వాలేదు. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. పవన్ ఎమ్మెల్యే అవటం కోసం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం కలిసి పోటీ చేయనున్నారు అని కొడాలి నాని వివరించారు.