జూపల్లి తీరుపై పార్టీ పెద్దలు మళ్లీ ఫోకస్ పెట్టారా…?

-

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వార్ అందరికీ తెలిసిందే. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన హర్షవర్దన్‌ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరినా ఒకరంటే ఒకరికి పడటం లేదు. అనేక సందర్భాలలో ఇద్దరి మధ్య విభేదాలు పీక్‌కు వెళ్లాయి.

పార్టీ పెద్దలు నచ్చజెప్పినా.. కలిసి పనిచేయాలని హితవు పలికినా ఇద్దరూ వినే పరిస్థితి లేదట. పంచాయతీ, మున్సిపల్‌, సహకార సంఘాల ఎన్నికల్లోనూ వర్గపోరుకు తెరతీశారు. పార్టీ ఆదేశాలను సైతం బేఖాతరు చేసి దూకుడుగా వెళ్లారు మాజీ మంత్రి జూపల్లి. అయితే ఇప్పుడు రూటు మార్చేశారని అంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్లాన్‌ చేసుకున్న కార్యక్రమాలను సైతం హైజాక్‌ చేసి.. తన వర్గీయులతో అమలు చేస్తున్నారట.

కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ర్యాలీలు చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా కొల్లాపూర్‌లో ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌లను పిలిచి.. భారీ ఎత్తున చేపట్టాలని ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జూపల్లి.. రెండు రోజులు ముందుగానే ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఇది పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచిందట. అలాగే టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా టీఆర్ఎస్‌ అధిష్ఠానం పెద్దల దృష్టికి వెళ్లిందట. పార్టీ పెద్దలు జూపల్లిపై గుర్రుగా ఉన్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news