తాను బీజేపీలో.. అన్నయ్య కాంగ్రెస్‌లో..ప్లాన్ బెడిసికొట్టిందా

-

అన్న పొలిటికల్‌ కెరీర్‌లో తమ్ముడు నిప్పులు పోస్తున్నారా..లేక అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారా..తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాహుల్‌ గాంధీని మొదలుకొని.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి వరకు అన్నీ వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఉన్నచోటే ఉండి.. పార్టీ నేతలకు చికాకు తెప్పిస్తున్నారు ఇప్పుడీ అంశమే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు టీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

మునుగోడు నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి పార్టీలోనే ఉంటూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దల నుంచి అధిష్టానం వరకు అందరి పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి సొంత పార్టీలో కాక పుట్టించారు. ఒకానొక సమయంలో ఆయనపై పార్టీ వేటు వేసేవరకు వెళ్లింది. అప్పట్లో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నచ్చజెప్పి ఆపారంటారు. చివరకు కార్యకర్తలతో సమావేశం పెట్టి బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారాయన. కాంగ్రెస్‌ నాయకులు కొందరు వారించినా.. తనతో వచ్చే వాళ్లు రావొచ్చు అని చెప్పేశారు కూడా.

ఈ వివాదంపై చర్చ జరుగుతుండగానే.. ఓ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ బీజేపీలో తానే సీఎం అభ్యర్థి అని రాజగోపాల్‌రెడ్డి కామెంట్‌ చేశారు. దాంతో ఆ పార్టీ డోర్లు మూసుకుపోయాయని చెబుతారు. ఒకవేళ అప్పట్లో బీజేపీలో చేరి ఉంటే.. కాంగ్రెస్‌ ఆయనపై అనర్హత పిటిషన్‌ ఇచ్చేది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కూడా వేగంగా నిర్ణయం తీసుకునేది. ఆ విధంగా మునుగోడు ఉపఎన్నిక వచ్చేది. ఆ సమయంలో మునుగోడుకు ఉపఎన్నిక రాబోతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా కామెంట్స్‌ చేశారు. అయితే అప్పుడున్న పరిస్థితిల్లో ఉపఎన్నికకు వెళ్లడం అంత ఈజీ కాదని అనుకున్నారో ఏమో కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు రాజగోపాల్‌రెడ్డి. ఇప్పుడు తిరుమల వెళ్లి మళ్లీ బాంబ్‌ పేల్చారు. పాత పల్లవిని కొత్తగా అందుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పీసీసీ చీఫ్‌ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్‌గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తననే సారథిని చేస్తారని అన్న కాన్ఫిడెన్స్‌గా ఉన్న సమయంలో తిరుమలలో రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ మళ్లీ కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. అన్నదమ్ముళ్లుగా కలిసి ఉంటాం.. వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో.. తాను బీజేపీలో ఉంటామన్న తమ్ముడి వ్యాఖ్యలు అన్నకు నష్టం కలిగించేలా ఉన్నాయట. వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వొద్దని అధిష్ఠానం దగ్గర వాదిస్తున్నవారికి రాజగోపాల్‌రెడ్డి ఆయుధం ఇచ్చినట్టు అయిందని అనుకుంటున్నారట. పైగా ఈ టైమ్‌లో తమ్ముడు చేసిన కామెంట్స్‌ వల్ల వెంకటరెడ్డి వెయిట్‌ తగ్గుతుందనే వారు ఉన్నారు.

తమ్ముడు విషయంలో గతంలోనే వెంకటరెడ్డిని పీసీసీ ప్రశ్నించిందట. ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు వివరణ ఇచ్చారట. దాంతో రాజగోపాల్‌రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారనే సమాచారం అధిష్ఠానం దగ్గర ఉందని చెబుతున్నారు. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని అనుకుంటే.. వెళ్లి కాషాయ కండువా కప్పేసుకోవచ్చు. కానీ.. ఆయన అలా చేయడం లేదు. కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. ఏది ఏమైన ఇటు కాంగ్రెస్ అటూ బీజేపీ రెంటికి చెడ్డ రేవడిల మారిన రాజగోపాల్ రెడ్డి ఎన్నికలు వచ్చే వరకు ఇదే లైన్‌లో వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news