కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే తాము కచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కొంతమంది పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకుండా చేయాలన్నారు. కేసీఆర్ ఇచ్చే ఇరవై నాలుగు గంటల విద్యుత్ కావాలా? రేవంత్ రెడ్డి చెప్పిన మూడు గంటల విద్యుత్ కావాలా? అని ప్రశ్నించారు.
అనంతరం మాట్లాడుతూ… కర్ణాటకలో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ప్రాధేయపడితే ప్రజలు నమ్మి ఓటు వేసిన కర్మకు నాలుగు నెలలకే రోడ్లపైకి రావలసిన దుస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధును రూ.16000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఆసరా పింఛన్లను ఐదు వేలకు, వికలాంగుల పింఛన్లను ఆరు వేలకు పెంచుతున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ 400కే అందిస్తామన్నారు. పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా మార్చామని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.