మోదీపై మంత్రి కేటీఆర్ సరికొత్త ఉద్యమం

-

ప్రధాని మోదీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సరికొత్త ఉద్యమం లేవనెత్తారు. లక్షలాది మంది మోదీకి ఉత్తరాలు రాయాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఉద్యమం చేయాలని అందరిని కోరారు. ఇవాళ ఆయన స్వదస్తూరితో ప్రధానికి పోస్టుకార్డు రాశారు.

చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డు ద్వారా మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. సానుకూల స్పందన రాలేదని కార్డులో పేర్కొన్నారు. చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్‌తో పాటు తాను కూడా పలుమార్లు ప్రధాని మోదీకి స్వయంగా లేఖలు రాశామన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే సాంస్కృతిక సారథులుగా పరిగణించి చేనేతపైన వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులతో పాటు చేనేత ఉత్పత్తుల పట్ల ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరూ పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news