ఎనిమిది రోజుల విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ నెల 15న ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్లారు. శనివారం రాత్రి సదస్సు ముగియడంతో ఆయన ఆదివారం తిరుగుపయనమయ్యారు. ‘మంచులో మధురానుభూతి’ అంటూ ఆయన తన ఫొటోను ట్వీట్ చేశారు.
మరోవైపు దావోస్ పర్యటన ద్వారా తెలంగాణకు రూ.21,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాలుగు రోజుల పర్యటన ఫలవంతంగా సాగిందని తెలిపారు. 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్‌టేబుల్ సమావేశాలు, రెండుప్యానల్ డిస్కషన్లలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
టెక్‌దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.16,000 కోట్ల పెట్టుబడితో.. హైదరాబాద్‌లో మరో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ. 2,000 కోట్ల పెట్టుబడితో భారతీ ఎయిర్‌టెల్.. భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించనుందని పేర్కొన్నారు.
ఫార్మారంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో రూ.1,000 కోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోందని వివరించారు. పెప్సికో, పీ అండ్ జీ, అల్లాక్స్, అపోలో టైర్స్ లిమిటెడ్, వెబ్‌పీటీ, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ వంటి.. పలు అంతర్జాతీయ సంస్థలు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించినట్లు కేటీఆర్ చెప్పారు.