తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో ఫార్మా, ఐటీ రంగాలకు దీటుగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రెండు ఎలక్ట్రానిక్స్ పరికరాల క్లస్టర్లు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే మరో రెండు ఏర్పాటు చేయనున్నట్లు కూడా స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో రాబోయే పదేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎలక్ట్రానిక్స్ సిటీలో రేడియెంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి ఎల్‌ఈడీ టీవీల తయారీ పరిశ్రమను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల విస్తరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.