ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పర్యటన జరుగనుంది. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, విగ్రహావిష్కరణ, కార్యకర్తల సమావేశాల్లో పాల్గొననున్నారు. తొలుత కేటీఆర్ లలిత కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీర్తి శేషులు కొడారి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవలను సత్కరించనున్నారు.

అదేవిధంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ సాయి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలతో సమీక్ష జరిపి రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యచరణను బలోపేతం చేసేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అంచెనా వేశారు.