మోదీకి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదు : కూనంనేని

-

తెలంగాణ కోసం ఒక్క పని కూడా చేయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు మోదీకి లేదని చెప్పారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క మంచిపని చేయని ప్రధానికి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కులేదని పేర్కొన్నారు.

తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే హక్కు మోదీకి ఎవరిచ్చారని కూనంనేని ప్రశ్నించారు. ఈ నెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపట్టడంతో పాటు 12న రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి తెలంగాణకు రావడానికి వీల్లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని వెల్లడించారు.

గవర్నర్ తమిళిసై రాజకీయ పద్దతిలో మాట్లాడుతున్నారని ఆక్షేపించిన ఆయన.. తెలుగు భాషను, తెలుగు రాష్ట్రాలను అవమానించేలా తమిళిసై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ తీరుపై త్వరలోనే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని కూనంనేని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news