కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో భట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ పూనుకుందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే మన గొంతును మనమే కోసుకున్న వాళ్లం అవుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్లోని ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే అన్నారు. మిగిలిన పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూడా తమదే అని తెలిపారు. రైతుబంధు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్లు కుట్రలు చేశాయని ఆరోపించారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందన్నారు. ‘సంపద పెంచుతాం.. పంచుతాం’ ఇదే కాంగ్రెస్ నినాదం అని తెలిపారు.
కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వగానే బీజేపీ కుట్రలు మొదలు పెట్టిందని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టామన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే మా ప్రభుత్వం కులగణన చేస్తుందని తెలిపారు. రిజర్వేషన్లు కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ లు కాంగ్రెస్కు ఓటు వేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగం ప్రమాదంలో ఉందన్నారు.