డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. వచ్చిన పైసలన్నీ ఖర్చులకే పోతే మీకు అనుభవం పెరుగుతుంది కానీ.. అకౌంట్‌లో డబ్బులు మాత్రం ఉండవు. దేశంలోని దిగ్గజ బీమా రంగ కంపెనీగా పేరుపొందిన ఎల్ఐసీ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో జీవన్ అక్షయ పాలసీ కూడా ఒకటి ఉంది. ఇది రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అంటే పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వారు ఈ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జీవన్ అక్షయ పాలసీ అనేది యాన్యుటీ ప్లాన్. అంటే ప్రతి నెలా పెన్షన్ వస్తుందన్నట్లు. సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ఒకేసారి డబ్బులు కట్టాల్సి వస్తుంది. తర్వాత మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే పెన్షన్ కూడా మారుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందొచ్చు. మీరు ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా మీకు పెన్షన్ చెల్లిస్తారు. ఒక్కసారి పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే తర్వాత దీన్ని మార్చుకోవడం కుదరదు. అందుకే ఎంచుకునే సమయంలోనే బాగా ఆలోచించి తీసుకోవాలి.
మీరు ఎంత ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే.. అంత ఎక్కువ పెన్షన్ వస్తుందని చెప్పుకోవచ్చు. కనీసం రూ. లక్ష నుంచి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. 30 ఏళ్ల నుంచి వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
మీకు 30 ఏళ్లు ఉంటే.. లైఫ్ టైమ్ ఆప్షన్ ఎంచుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు రూ. 5 లక్షలు పెడితే.. మీకు ఏడాదికి రూ. 28 వేల వరకు వస్తాయి. అంటే నెలకు రూ. 2300 పొందొచ్చు. ఆరు నెలలకు రూ. 14 వేలు, మూడు నెలలకు రూ. 7 వేల వరకు వస్తాయి. అదే రూ. 16 వేలు పొందాలని భావిస్తే
ఎల్ఐసీ జీవన్ అక్షయ ప్లాన్‌లో రూ. 35 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మూడు నెలలకు రూ. 49 వేలు, ఆరు నెలలకు రూ. లక్ష, ఏడాదికి రూ. 2 లక్షలు వస్తాయి. ఇలా మీరు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. మరణించిన తర్వాత నామినీకి ఎలాంటి డబ్బులు రావు. అదే మనీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు దాన్ని ఎంచుకుంటే మీరు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి.