మరోసారి వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. ఇవాళ.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో లోకేశ్ ప్రసంగం వాడీవేడిగా సాగింది. తన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని పేర్కొన్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. ఒక సిల్లీ బచ్చా తన పాదయాత్రకు జనాలే రావడంలేదని అంటున్నాడని తెలిపారు. కానీ, కార్యకర్తలే అండగా యువగళం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని లోకేశ్ ఉద్ఘాటించారు. తన పాదయాత్ర చూసి జగన్ కు మతిపోయిందన్నారు.
తనపై 20 కేసులు పెట్టారని, వాటిలో హత్యాయత్నం కేసు కూడా ఉందని లోకేశ్ వెల్లడించారు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని, అయినా తానేమీ భయపడలేదని అన్నారు. తనపై మోపిన కేసుల్లో కనీసం ఒక్కదాంట్లోనైనా ఆరోపణలు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. జగన్ తన మంత్రులను కూడా తనపైకి ఉసిగొల్పారని లోకేశ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలే తన బలం అని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తగ్గుతానా? వెనుకడుగు వేస్తానా? మనం భయపడతామా? అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు.