శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని , ఫ్లెక్సీలను నిషేధిస్తున్నామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 2027 నాటికి ఏపీ ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
విశాఖలో పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు పవన్ కళ్యాణ్. విషవాయువుల లీకేజీ జరుగుతున్నా వాటిని అరికట్టే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వీటికి కారకులైన వారిపై ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు ఒక్కసారిగా పర్యావరణం పై ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మరోవైపు ప్లాస్టిక్ నిషేధం పై టిడిపి సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన గోరంట్ల బుచ్చయ్య.. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే.. హలో బ్రదర్ సినిమాలో విలన్ గుర్తుకు వస్తున్నాడు అంటూ చురకలంటిన్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఫ్లెక్సీలు కనిపించకూడదనే భావనతోనే జగన్ ఈ పిలుపు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఉందని ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలొబ్రదర్ సినిమా లో విలన్ గుర్తుకు వస్తున్నాడు..!#GBC#FailedCMjagan
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) August 27, 2022