మొసళ్ల లోడుతో వెళ్తున్న లారీ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో లారీలో సెటప్ చేసిన తొట్టెలో ఉన్న మొసళ్లు కాస్త రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట సమీపంలోని 44 జాతీయ రహదారిపై వెలుగుచూసింది. లారీ బోల్తా కొట్టిన సమయంలో రెండు మొసళ్లు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
బిహార్ జిల్లా పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలాజికల్ పార్కు నుంచి బెంగుళూరులోని బానర్ గట్స్ బయోలాజికల్ పార్కుకు 8 మొసళ్లను లారీలో తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో అదుపు తప్పి లారీ బోల్తా కొట్టినట్లు సమాచారం. దీంతో మొసళ్లు లారీ నుంచి బయట పడిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టారు.డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.