ఈ రోజుల్లో వ్యవసాయాన్ని నమ్ముకుంటే మిగిలేది అప్పు మాత్రమే అన్నట్లు తయారైంది. రైతులకు ప్రభుత్వాలు ఏదో చేస్తున్నాయని అనే భ్రమలో ఉన్నాయి.. వీళ్లు ఇచ్చే బంధులు ఒకసారి కూలీ ఖర్చులకు కూడా సరిపోవు అనేది రైతన్నమాట. చేతికొచ్చిన పంట.. అయితే గిట్టుబాటు ధర ఉండదు..లేదంటే వర్షం గద్దల వచ్చి తన్నుకుపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సాగులో సిరులు పండిస్తున్నారు తండ్రికొడుకులు. వీరి స్టోరీ చూస్తే.. వ్యవసాయం కూడా లాభదాయకమే అనిపిస్తుంది.
కుటుంబానికి పదెకరాల పొలం ఉంది. వరి, పత్తి, పసుపు, కంది, మొక్కజొన్న, వేరుశనగ.. ఇలా ఎన్ని పంటలు మార్చినా నష్టాలు తప్ప మిగిలిందేమి లేదు. వీటికి భిన్నంగా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు మహబూబాబాద్ జిల్లా ధన్నసరి యువకుడు వేం పార్థసారథిరెడ్డి. తండ్రితో కలిసి పట్టుపురుగుల పెంపకంలోకి అడుగుపెట్టాడు. కొద్దిరోజుల్లోనే అప్పులు కనుమరుగై ఏడాదికి రూ.40లక్షల వరకు ఆదాయం వస్తోంది.
పార్థసారథి అన్నలిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తనూ ఏదో చిన్న ఉద్యోగం చేస్తుండే వాడు. కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నా.. తండ్రి మాత్రం ఉన్న భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసేవారు. ఇక వ్యవసాయం అంటే చెప్పేది ఏం ఉంటుంది.. పిల్లలు ఎదిగినట్లు.. చేసిన అప్పులు కూడా వడ్డీమీద వడ్డీతో ఎదుగుతూ వచ్చేవి. తండ్రి కష్టాన్ని చూసి.. ఇదంతా కాదు.. ఏదైనా కొత్తగా చేయాలని డిసైడ్ అయ్యాడు. జాబ్ మానేసి.. తండ్రితో కలిసి పట్టుపురుగుల ఉత్పత్తి కేంద్రం ప్రారంభించారు.
2011లో రెండెకరాలతో మొదలుపెట్టిన మల్బరీ తోట సాగును ప్రస్తుతం ఎనిమిది ఎకరాలకు విస్తరించారు. మొదటి ఐదేళ్లు బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి గుడ్లను తెచ్చి ఇంటి దగ్గరే పురుగుల ఉత్పత్తి చేసేవారు. అవి ఏడెనిమిది రోజుల వయసువి కాగానే రేరింగ్ (పెద్ద పురుగుల కేంద్రం)లో పట్టుగూళ్ల పెంపకాన్ని మొదలుపెట్టారు.. ఈ గూళ్లను జనగామ, హైదరాబాద్‌లతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విక్రయించేవారు. పట్టు గూళ్లే కాదు.. పట్టు పురుగుల ఉత్పత్తి కూడా చేసి తోటి రైతులకు విక్రయించాలని భావించాడు పార్థసారథి.
దీనికోసం 2016లో కర్ణాటక మైసూర్‌లోని సెంట్రల్ సెరీకల్చర్ రిసెర్చ్ అండ్ ట్రెనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడు నెలల పాటు శిక్షణ పొందాడు. తర్వాత సొంతంగా గుడ్లను కొనుగోలు చేసి, ఇంటి దగ్గరే పట్టు పురుగుల ఉత్పత్తి కేంద్రాలు స్టాట్ చేశాడు. చుట్టుపక్కల రైతులు ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ఏడాదికి 24 బ్యాచ్‌ల పిల్లలు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నాడు. కట్ చేస్తే.. ఖర్చులూ పోనూ ఏడాదికి రూ.40 లక్షల వరకు ఆదాయం మిగులుతోందట. సంప్రదాయ పంటల్ని మాత్రమే నమ్ముకోకుండా.. కొంచెం సృజనాత్మకంగా ఆలోచించి పట్టుగూళ్ల పెంపకంలాంటి ప్రత్యామ్నాయాల వైపు వెళ్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువగా సంపాదించొచ్చు అంటున్నాడు ఈ యువరైతు పార్థసారథి.
వ్యవసాయానికి సాంకేతికత.. చదువుకున్న జ్ఞానం తొడైతే.. అగ్రికల్చర్ ను కూడా.. అందమైన వ్యాపారంగా మలుచుకోవచ్చు. రైతును రాయల్ బిజినెస్ మెన్ గా కూడా చేసేయొచ్చు. కొంచె ఈ దిశగా అడుగులు వేసి వినూత్నంగా వ్యవసాయం చేసి చూడండి..! మన భూముల్లో ఇవి పండవు, వీటి మీద అవగాహన లేదు, ఇదంతా అయ్యే పనికాదు ఇలాంటి మాటలను పక్కనపెట్టి.. మంచి ప్లానింగ్ తో దిగితే.. రేపటి కవర్ స్టోరీ మీదే కావొచ్చు.
-Triveni Buksarowthu