కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈసారి హంగ్ అసెంబ్లీ రాదని, కాంగ్రెస్ విస్పష్ట మెజారిటీతో పాలనా పగ్గాలు చేపడుతుందని అన్నారు. బీజేపీని మట్టికరిపించాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ ముందుకెళుతున్నదని చెప్పారు. ఖర్గే శుక్రవారం ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైతే పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో తాను సుడిగాలి పర్యటనలు చేస్తున్నానని, ఒక్కోసారి సాయంత్రం సభలో పాల్గొనేందుకు తాను 100 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నానని చెప్పారు.
బీజేపీని ఓడించాలనే కసితో అన్నింటిని భరిస్తున్నామని కర్నాటకలో తన నాన్ స్టాప్ ర్యాలీలను ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వివిధ పార్టీల అగ్రనేతలు ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.