కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గించడంపై మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. దేశంలో ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గుతాయని ఫైరయ్యారు. ఎల్లకాలం ధరలను పెంచుకుంటూ పోయి ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గించడం బీజేపీ సర్కారు విధానమని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతున్న గ్యాస్ ధర ఎంతకు చేరిందని, అందులో ఇప్పుడు ప్రభుత్వం తగ్గించింది ఎంతని ప్రశ్నించారు మమతా బెనర్జీ.
ముంబైలోని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన అనంతరం బయటికి వచ్చిన మమతాబెనర్జిని.. మీడియా ప్రతినిధులు గ్యాస్ ధర తగ్గింపుపై ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు మమతా బెనర్జీ. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగే INDIA కూటమి మూడో సమావేశంలో పాల్గొనేందుకు మమతా బెనర్జి ముంబైకి చేరుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు.