సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో I.N.D.I.A. కూటమిలోని ఇతర పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఆయన వ్యాఖ్యలకు దూరం పాటిస్తున్నాయి. ఇప్పటికే ఈ కూటమిలోని కాంగ్రెస్ తాము అన్ని మతాలను గౌరవిస్తామని ప్రకటించగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఉదయనిధి వ్యాఖ్యలతో విభేదించింది.
తాజాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ సోమవారం తీవ్రంగా ఖండించింది, ప్రతిపక్షాల I.N.D.I.A. కూటమికి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
“తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్‌ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపింది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు. సనాతన ధర్మాన్ని గౌరవిస్తామని.. పూజలు చేసే పూజారులకు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. బెంగాల్‌లో దుర్గాపూజను పెద్ద ఎత్తున జరుపుకుంటామని.. గుళ్లు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలకు వెళ్తామని.. ప్రతి మతాన్ని గౌరవిస్తామని మమతా అన్నారు.