ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎంతో ప్రేమగా జీవించసాగారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా మరో వ్యక్తి తమ జీవితాల్లోకి వస్తోందని ఎంతో సంబురపడ్డారు. కానీ ప్రగ్నెన్సీలో కొన్ని సమస్యల వల్ల బిడ్డకు జన్మనిస్తూ తల్లి మరణించింది. ఆ బిడ్డ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచారు. ఓవైపు భార్య మరణం.. మరోవైపు చావుబతుకుల్లో ఉన్న బిడ్డను చూసి తట్టుకోలేని భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారక ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట్ జిల్లా ముక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ (28) ఇంటిపక్కనే ఉండే భీమేశ్వరి ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో ఏడాది క్రితం వివాహం చేసుకుని నగరానికి వచ్చి మౌలాలి ప్రగతినగర్ లో నివాసం ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18 వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భీమేశ్వరికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే పక్కింటి మహిళ సాయంతో భీమేశ్వరిని నేరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రసవం అనంతరం భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు శిశువును గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువును వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆస్పత్రిలో మృతిచెందింది. చిన్నారి వెంటిలేటర్‌పై, మార్చురీలో భార్య మృతదేహం ఉండటంతో జీర్ణించుకోలేని నవీన్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.