రోడ్డుపై సిగరెట్‌ పీక.. రూ.55 వేలు జరిమానా

-

రోడ్డు మీద సిగరెట్ పీక పడేసిన బ్రిటీష్ పౌరుడికి ఇంగ్లాండ్ లోని ఓ కోర్టు ఏకంగా రూ.55 వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థోర్న్ బరీ టౌన్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అలెక్స్‌ డేవిస్‌ అనే వ్యక్తి.. సిగరెట్‌ తాగి దాని పీకను రోడ్డుపై పడేశాడు. దీన్ని గమనించిన స్ట్రీట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అలెక్స్‌కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు. ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అధికారుల ఆదేశాలను అతను లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహించిన అధికారులు అలెక్స్‌పై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్‌కు రూ.55 వేలు జరిమానా విధించారు. సిగరెట్‌ తాగి పీకను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారవుతాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి సంవత్సరం, పొగాకు పరిశ్రమ ఆరు ట్రిలియన్ సిగరెట్లను ఉత్పత్తి చేస్తుంది, వీటిని ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ధూమపానం చేసేవారు వినియోగిస్తున్నారు. ఈ సిగరెట్‌లలో ప్రధానంగా సెల్యులోజ్ అసిటేట్ ఫైబర్స్ అని పిలువబడే మైక్రోప్లాస్టిక్‌లతో కూడిన ఫిల్టర్‌లు ఉంటాయి. సరిగ్గా పారవేసినప్పుడు, సిగరెట్ పీకలను సూర్యరశ్మి, తేమ వంటివి విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి మైక్రోప్లాస్టిక్‌లు, భారీ లోహాలు, అనేక ఇతర రసాయనాలను విడుదల చేస్తాయి. దీనివల్ల పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం, సేవలపై ప్రభావం చూపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news