కన్న తండ్రి మృతి.. కాటికి పంపాల్సిన కొడుకు చేసిన పని తెలిస్తే షాకవుతారు

కన్న తండ్రి చనిపోతే ఎవరైనా అంతిమ సంస్కారాలు నిర్వహించి అంతిమ వీడ్కోలు పలుకుతారు. కడసారి చూపు కోసం బంధు మిత్రులకు సమాచారం పంపుతారు. కానీ, ఆ కొడుకు ఆ పనిచేయలేదు. తండ్రి చనిపోయిన బాధలో మతిస్థిమితం కోల్పోయాడు. ఏం చేయాలో తెలియక శవంతోనే గత మూడు నెలలుగా గడుపుతున్నాడు. ఈ హృదయ విదారకరమైన సంఘటన కోల్‌కత్తాలో చోటుచేసుకుంది.

కోల్‌కతా నగరం కేపీ రాయ్ లేన్‌లో ఓ ఇంటి నుంచి గత కొంత కాలంగా దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. కుళ్లిపోయిన తండ్రి శవంతోపాటు ఉంటున్న 40ఏండ్ల కొడుకును చూసి అవాక్కయ్యారు. ఆ వ్యక్తి మూడు నెలల క్రితం మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతిచెందిన వ్యక్తిని 70ఏండ్ల సంగ్రామ్ డే‌గా గుర్తించారు. ఆయన కొడుకు పేరు కౌశిక్ డే‌గా తెలిపారు. కన్న కొడుకు మానసిక వికలాంగుడని, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.