నటుడిగా చాలా సంతృప్తిగా ఉన్నానని.. ఇకపై ‘మా’ వంటి ఎలాంటి ఎన్నికల్లో తాను పోటీ చేయనని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ‘జిన్నా’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీమర్స్/యూట్యూబర్స్ మీట్‌లో ఆయన మాట్లాడారు. విష్ణు హీరోగా ఇషాన్ సూర్య తెరకెక్కించిన జిన్నాలో సన్నీ లియోనీ, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలు.
” ‘మా’ తో సహా మరెలాంటి ఎన్నికల్లో నేను మళ్లీ పోటీ చేయను. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నానన్నారు. అదీ నిజం కాదు. నటుడిగా నా జీవితం చాలా బాగుంది. నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చేలా కష్టపడతా.” అని మంచు విష్ణు వివరించారు.
‘‘నాపై నెగెటివ్ మీమ్స్ వేసిన వారినీ, యూట్యూబ్‌లో నెగెటివ్ కంటెంట్ పెట్టిన వారినీ పిలిచా. కానీ, టార్గెట్ చేసి రాసేవారిని వదిలిపెట్టను. మీపై ట్రోల్స్ వస్తుంటే పట్టించుకోరేంటి అని ‘మా’ ఎన్నికల సమయంలో చాలామంది నన్ను అడిగారు. అప్పుడు ఎలక్షన్‌పైనే దృష్టి పెట్టా. ఇప్పుడు ట్రోల్స్ చేసిన వారిపై పెట్టా. నా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని కొందరు విమర్శించారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీతోపాటు ఓ ప్రముఖ నటుడి ఆఫీసుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు బయటపడ్డాయి. ఆడవారిని విమర్శిస్తే ‘మా’ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది’’ అని మంచు విష్ణు హెచ్చరించారు.