ప్రస్తుతం తిరుమలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎంకు అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా నిర్మితమైన పరాకమణి భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అంతకుముందు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
పట్టు వస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీఠానికి, ధ్వజ స్తంభానికి మొక్కుకొని వెండి వాకిలి మీదుగా బంగారు వాకిలి చేరుకొని గరుడాళ్వార్ ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టు వస్త్రాలను సమర్పించి, స్వామిని దర్శించుకున్నారు.