బీఆర్ఎస్ స్కామ్‌లు చేస్తున్నా.. బీజేపీ కాపాడుతూ వస్తుందని ఆరోపించారు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మానిక్ రావు థాక్రే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌లో కవితను ఎందుకు అరెస్టు చేయలేదని? ప్రశ్నించారు. స్కామ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. సీబీఐ కవితను ఏమీ చేయలేకపోయిందని మానిక్ రావు థాక్రే విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య ఎప్పట్నుంచో ఒప్పందాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందని జోస్యం చెప్పారు. మ్యాజిక్ ఫిగర్‌ను సులువుగా చేరుతున్నట్లు తమ సర్వేలో తేలిందన్నారు. కమ్యూనిస్ట్‌లతో చర్చలు, ఆర్.కృష్ణయ్య భేటీలు పీసీసీ చీఫ్, సీఎల్పీలకు చెప్పే చేశానని చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని, పొత్తులు త్వరలో ఫైనల్ అవుతాయన్నారు.
ఇటీవల మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్య ఇతర సంఘాల నేతలు కూడా తనను కలసినట్లు థాక్రే వివరించారు. బయటకు వెళ్లి మళ్లీ వాళ్లు కాంగ్రెస్‌ను ఎందుకు విమర్శించారో? అర్థం కాలేదన్నారు. ఇప్పటి వరకు పొత్తుల విషయంలో హై కమాండ్ నుంచి ఎలాంటి ఆదేశలు లేవన్నారు. రాష్ట్రంలో పార్టీకి ఉపయోగపడే విషయాలు పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నామన్నారు. లెఫ్ట్ పార్టీలతో చర్చలు.. అధికారికంగా ఇంకా జరగలేదన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు మొదలైతే.. సీఎల్పీ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్ సమక్షంలోనే నిర్వహిస్తామన్నారు. సీపీఐతో కేవలం అనధికార మీటింగ్ జరిగిందన్నారు.