హైదరాబాద్ కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ మరోసారి విచారణకు హాజరైన ఆయన విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. అటు మాదాపూర్ పోలీసులు ఇటు గచ్చిబౌలి పోలీసులు తన ఫోన్ అడుగుతున్నారని క్రిశాంక్ తెలిపారు. ఒకటే ఫోన్ ఎంత మందికి ఇవ్వాలని ప్రశ్నించారు. సగం సగం ఇవ్వమంటారా.. లేదా బ్యాటరీ ఒకరికి, ఛార్జర్ ఒకరికి, డిస్ప్లే ఒకరికి ఇవ్వమంటారా అని ఎద్దేవా చేశారు.
కంచ గచ్చిబౌలిలోనూ భూములపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను పంపడంతో వందల ఎకరాల్లో చెట్లు నేలమట్టమయ్యాయని.. దాంతో అక్కడి వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయని ఇటీవల నెట్టింట వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇవి ఏఐ ఫేక్ వీడియోలని.. వీటిని షేర్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులు పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోనే క్రిశాంక్ పలుమార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.