ప్రముఖ నటుడు, రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేసింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నము అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కృష్ణంరాజు మరణం పై జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు. ” తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దిగ్గజం ఈరోజు లేకపోవడం ఎంతో బాధాకరం.భౌతికంగా లేకున్నా ఆయన మనతోనే ఉంటారు. నాన్నగారికి ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అన్నారు ఎన్టీఆర్. కృష్ణంరాజు మరణం పై ప్రగాఢ సానుభూతిని తెలిపారు నటి జయసుధ. ” ఈరోజు నా హీరో లేరు అంటే నమ్మలేకపోతున్నాను. 26 సినిమాలు ఆయనతో నేను కథానాయకగా పనిచేశాను. గోపి కృష్ణ బ్యానర్ లో సూర్యనారాయణ రాజు ప్రొడక్షన్ లో ఎక్కువ సినిమాలు చేశాను. మంచి కో స్టార్, మంచి స్నేహితుడు, ఇప్పుడు నవ్వుతూ పలకరిస్తారు”. అని అన్నారు జయసుధ.
కృష్ణంరాజు గారు లేని లోటు తీర్చలేనిది అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. “ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అంచలంచెలుగా ఎదిగారు. ప్రేక్షకుల అభిమానం చురగొన్నారు. కేంద్ర మంత్రిగా ఎదిగారు. ప్రభాస్ పాన్ ఇండియా నటుడిగా ఎదిగినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు చేస్తుంది. ఆయనకు ఎంత చేసినా తక్కువ. నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి”. అన్నారు మంత్రి తులసాని. మరి కాసేపట్లో కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు మంత్రి కేటీఆర్.