మేడారం సమక్క-సాలరమ్మ జాతరలో నేడు కీలక ఘట్టం జరుగనుంది. చిలకల గుట్ట నుంచి సమక్క తల్లిని భక్తి శ్రద్ధలతో ఆదివాసీ పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. దీంతో ఈరోజు మేడారంలో భక్తుల సంఖ్య పెరగనుంది. ఇసుకేస్తే రాలనంతగా మేడారానికి ప్రజలు రానున్నారు. జిల్లా ఎస్పీ గన్ ఫైర్ చేసి సమక్క తల్లికి ఆహ్వానం పలుకనున్నారు. ఇప్పటికే.. ఆదివాసీ పూజారులు సారలమ్మ తండ్రి పగిడిద్దరాజును, భర్త గోవిందరాజులును కూడా వేర్వేరు ప్రాంతాల తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. నిన్న కన్నెపెల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టించారు. నేడు సమక్క తల్లి కూడా వస్తుండటంతో జాతరలో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. గద్దెలకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తల్లిని తీసుకురానున్నారు. శివసత్తుల పూనకాలు, సమక్క వచ్చే దారిలో భక్తులు ముగ్గులతో స్వాగతం పలుకనున్నారు. మారుమూల ప్రాంతంగా ఉన్న మేడారం నేడు.. మహానగరాన్ని తలపించనుంది. రేపు సమక్క-సారలమ్మ తల్లులు ఇద్దరు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు తమ మొక్కులు చెల్లించనున్నారు.
మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం… గద్దెలపైకి నేడు సమక్క ఆగమనం
-