కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 50 ఏండ్లు అధికారమిచ్చినా కాంగ్రెస్ ఏం చేయలేదు. ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తారు..? 50 ఏండ్లలో చేసింది ఏమీ లేదు.. కానీ గడప గడపకు కాంగ్రెస్ అంట. కాంగ్రెస్ మాటలు వింటుంటే విచిత్రం అనిసిస్తుంది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. షబ్బీర్ అలీ మంత్రి గా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ రాలేదు. కానీ కేసీఆర్ నాయకత్వంలో మెడికల్ కాలేజీ వచ్చింది. 9 ఏండ్లలో మేం ఏం చేశామో చెప్పాలంటే సమయం సరిపోదు. రైతుబీమా కింద రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాం. గతంలో సర్కార్ దవఖానాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు సర్కార్ దవఖానాలకు రోగుల సంఖ్య పెరిగింది. కంటి వెలుగు ద్వారా ఉచితంగా కండ్లద్దాలు అందించాం.
ఈ ప్రోగ్రామ్ ద్వారా పెద్ద మనషులకు అండగా నిలబడ్డాం. దమ్ముంటే మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. అన్ని వర్గాలకు కేసీఆర్ ద్వారా మేలు జరిగింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీడీ కార్మికులకు, టేకేదార్లకు పెన్షన్లు ఇస్తున్నాం. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు మోపైతరు. వారు నోటికొచ్చినట్టు చెప్పే మాటలను నమ్మొద్దు అని కేటీఆర్ ప్రజలకు సూచించారు. నరేంద్ర మోదీ కూడా ప్రజలకు చేసిందేమీ లేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిలిండర్ ధరలు పెరిగాయని మన్మోహన్ సింగ్‌ను తిట్టిండు. కానీ ఇవాళ సిలిండర్ ధర మాత్రం 1200 అయింది. నాడు గ్యాస్ బండకు మొక్కి కాంగ్రెస్‌కు పిండం పెట్టమని చెప్పిండో.. మళ్లీ మనం అదేపని బీజేపీకి చేయాలి. పిరపమైన ప్రధానికి ఓటు ద్వారానే బుద్ది చెప్పాలి.
బీజేపీకి ఎల్లారెడ్డిలో డిపాజిట్ గల్లంతు కావాలి. అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. దీంతో నిత్యావసర ధరలు పెరిగాయి. ప్రధాని మంత్రికి, బీజేపీకి బుద్ది చెబుతూ.. ఐదు దశాబ్దాలు మనల్ని ఏడిపించిన కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి. మనకున్నది ఒకే ఒక్క మార్గం.. రామబాణం కేసీఆర్. మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేసీఆర్ మాత్రమే. ఢిల్లీ బానిసలతో ఏం కాదు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంటే ఢిల్లీలో నిర్ణయాలు జరుగుతాయి. కానీ మనమే అధికారంలో ఉంటే.. తెలంగాణలోనే నిర్ణయాలు జరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.