ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా శనివారం ఆమె విచారణకు హాజరయ్యారు. అయితే లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడం, ఆమెను ఈడీ విచారణ చేయడం వంటి ఘటనలతో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీపై , కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని, తెలంగాణ పరువు తీశారని విమర్శించారు. తన బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ మాటలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని కోరారు. 2023, మార్చి 11న హనుమకొండలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై పోరాడుతామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ఉద్యమించడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక ఈడీతో దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి ఎర్రబెల్లి. కవితను జైల్లో పెడతారని బండి సంజయ్ ముందే ఎలా చెప్పగలిగారు అని ప్రశ్నించారు. అంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈడీ దాడులు చేస్తోందనేది విషయం తేటతెల్లమౌతోందని వ్యక్తపరిచారు. బండి సంజయ్ పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎర్రబెల్లి హెచ్చరించారు.