బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం తమదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలు వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారన్నారు.
బీసీలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎనలేని సేవ చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు. గౌడ కులస్థులు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా సర్కార్ చేయూత అందిస్తుందని పేర్కొన్నారు.
నీరా కేఫ్ ను ప్రారంభించడంతోపాటు గౌడ బీమా సైతం ప్రకటించారని, ఉద్యమకారుడు వెనుకబడిన వర్గాల ప్రతినిధి పల్లె రవికుమార్ గౌడ్ కు సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు , గౌడ వృత్తిదారులు పాల్గొన్నారు.