బుధవారం మధుర కాలనీలో ఎస్‌బీఐ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ సీఎం జగదీష్ శెట్టార్ ఓటు వేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలుపొందుతుందని, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఘన విజయం సాధిస్తానని శెట్టార్ స్పేసతం చేశారు.
బీజేపీ అతనికి టికెట్ నిరాకరించడం తెలిసిందే. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టార్ ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. కర్నాటకలో అన్ని కులాలు, వర్గాల వారు కాంగ్రెస్ వెంట నిలిచారని, ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వెల్లడించారు ఆయన. బీజేపీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగడం ఖాయమని తేల్చి చెప్పారు.
ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్, అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాషాయ పార్టీలో కాస్త హడావిడి జరిగింది. ఇంకో వైపు వీరశైవ లింగాయత్ గ్రూపు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇవ్వడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు తెలియపరచనున్నారు.