కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం మరోమారు ట్విట్టస్త్రాలు సంధించారు. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం దారుణమని అన్నారు మంత్రి కేటీఆర్. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోంది గనుక దానిని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సుధాంషు పాండే బుధవారం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్.
కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే…ఇక రైతులకు ఉచిత విద్యుత్ అనేదే దక్కదని కూడా కేటీఆర్ అన్నారు. రైతులకు ఇస్తున్న రాయితీలు ఎత్తివేసేందుకే కేంద్రం విద్యుత్ సంస్కరణలను ముందుకు తెస్తోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణ రైతాంగమేనని ఆయన అన్నారు. ఈ సంస్కరణలు అమలు అయితే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, తమ పొలంలో రైతులు కూలీలుగా మారిపోతారని అన్నారు మంత్రి కేటీఆర్.