మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు సమీపిస్తున్న కొద్ది అధికార టీఆర్ఎస్ ప్రచారంలో జోష్ పెంచింది. ముఖ్యనేతలంతా నియోజవర్గంలో తిష్ట వేసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలం దేవర భీమనపల్లిలో ప్రచారం నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలు నియోజకవర్గాని ఏం చేశాయని ప్రశ్నించారు. అభివృద్ధి చేయకుండా ఏ ముఖం పెట్టుకుని వారు ప్రజలను ఓట్లడుగుతారని నిలదీశారు. ఈ ఉపఎన్నిక బీజేపీ పార్టీ ప్రజలపై రుద్దిన బలవంతపు ఎన్నిక అని మంత్రి వ్యాఖ్యానించారు.
దేశంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తోందని, ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించిందని తెలిపారు. అన్ని వర్గాల వారి సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ పాటు పడుతోందని చెప్పారు.