బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో వెలుగులోకి మరో అక్రమం

-

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపడుతోంది. వారి పరిశీలనలో ఈ పాఠశాలకు సంబంధించిన మరో అక్రమం బయటపడింది. ఈ పాఠశాలకు 5వ తరగతి వరకే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల పరిశీలనలో తేలింది. కానీ సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో 6, 7 తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సఫిల్‌గూడకు చెందిన విద్యార్థులకు బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులకు యాజమాన్యం తెలిపింది. పాఠశాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీనివల్ల దాదాపు 650 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

విద్యాశాఖ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ పర్యవేక్షణలో పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తల్లిదండ్రుల విజ్ఞప్తులపై విద్యాశాఖ అధికారులు చర్చిస్తున్నారు. ఈ అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news