రోజు రోజు దేశంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. అవసరానికి సరిపడ విద్యుత్ ను ఉత్పన్నం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అయితే విద్యుత్ వినియోగం, సరఫరాపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు కొరత విద్యుత్ సమస్యలకు ప్రధాన కారణమన్నారు.
కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయన్నారు. దీంతో పాటు ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావం కూడా బొగ్గు లభ్యతపై పడిందన్నారు. బొగ్గు కొరత వల్ల పెద్ద రాష్ట్రాలు సైతం తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. గతంతో పోల్చితే ప్రస్తుతం బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరాయని, దిగుమతి చేసుకోవడం కూడా క్లిష్టంగా మారిందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. వచ్చే నెలలో ఏపీలో విద్యుత్ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయా ధీమా వ్యక్తం చేశారు.