జాతీయ మీడియాకు రోజా ప్రశ్నల వర్షం

-

మంత్రి రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి నేతల వల్ల భవిష్యత్తు స్వప్నాలు నిర్ణయించుకోవడంలో బాలికలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి వస్తోందని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. నలభై ఏళ్ల క్రితం తాను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు పురుషాధిక్యం కలిగిన ప్రపంచంలో పని చేస్తున్నందున మహిళగా నా ముద్ర కష్టమని చెప్పారని, పాతుకుపోయిన స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా తాను అనునిత్యం పనిచేశానని, రెండుసార్లు ఎన్నికల్లో తాను ఓడిపోయినా కసితో పని చేసి ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎం వైఎస్ జగన్ తీసుకుంటోన్న మహిళా అనుకూల విధానాలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ తనను మంత్రిని చేశారని గుర్తు చేశారు. మహిళలు ఎంతగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బండారు సత్యనారాయణ వంటి కొంతమంది పురుషుల మధ్యయుగం లాంటి ఆలోచనలు మారలేదని పేర్కొన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారన్నారు.

ఈ రోజు నేను అన్ని జాతీయ మీడియా ఛానల్స్‌ను ప్రశ్నించాలనుకుంటున్నాను, బండారు వంటి వ్యక్తులను మీరు సమర్థిస్తారా? మరి అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు మీ ఆక్రోశం, ఆవేశం ఎక్కడకు పోయింది? బండారు సత్యనారాయణ వంటి పురుష అహంకారం కలిగిన వారు మహిళలను దుర్భాషాలాడటం ద్వారా భవిష్యత్తు కోసం కలలు కనే అమ్మాయిలకు నష్టం చేకూర్చినవారు అవుతారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సీఎన్ఎన్ న్యూస్18, రిపబ్లిక్ టీవీ ఛానళ్లను ట్యాగ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version