అనుకోకుండా పదవి వస్తే అదృష్టం అంటారు. అదే అదృష్టం ఆయన్ని పదేపదే తలుపు తడుతోందట. దీంతో ఆయన గురించే జిల్లాలో చర్చించుకుంటున్నారు. మొదటిసారే మంత్రి అయిన ఆయన శాఖల్ని కూడా మార్చేస్తారని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరిగింది. ఇదే సమయంలో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర నారాయణకు ఎవరు ఊహించని విధంగా ప్రమోషన్ దక్కింది. పంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న శంకరనారయణ పై ఇప్పుడు జిల్లాలో కొత్త చర్చ జరుగుతుందట…
పెనుకొండ నుంచి తొలిసారిగా శంకరనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటిసారే సీఎం జగన్ నుంచి పిలుపు రావడం.. మంత్రి కావడం జరిగిపోయింది. దీంతో అంతా లక్కీ శంకరనారాయణ అని అనుకున్నారు. ఒకప్పుడు పెనుకొండ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. పరిటాల రవి ఎంట్రీ తర్వాత టీడీపీ అడ్డాగా మారింది. అలాంటి నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేయడమే కాకుండా.. భారీ మెజారిటీ సాధించారు శంకరనారాయణ. దీనికితోడు కురుబ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో.. ముఖ్యమంత్రి జగన్ ఈక్వేషన్స్‌కు సరిపోయారట.
తొలిసారి ఎమ్మెల్యే అయిన సంబరంలో ఉన్న శంకరనారాయణను ఏకంగా మంత్రిని చేయడంతో ఆయనకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదని అంటారు. మొదట్లో తడబడినా.. కొందరు ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించకపోయినా.. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. వివాదాలు కూడా ఏం లేవు. ఇంతలోనే ఆయన్ని మరోసారి అదృష్టం తలుపుతట్టడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు. మొన్నటి వరకూ బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు శంకరనారాయణ. ఇప్పుడు ఆ శాఖను కొత్త మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు కేటాయించారు. శంకర నారాయణకు ఆర్ అండ్ బీ ఇచ్చారు. ఇది గతంలో ఉన్న శాఖ కంటే ఇంకా మంచి విభాగమని మంత్రి అనుచరులు, జిల్లా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట.
ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండానే, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వరుసగా అదృష్టం తలుపుతడుతోందని అనుకుంటున్నారట. అయితే ఇలాంటి ఛాన్స్ దక్కని అనంతపురం జిల్లాలోని ఇతర వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోలోన తెగ జలసీ ఫీలవుతున్నారట. ఈ జిల్లా నుంచి ఆయనొక్కరే మంత్రిగా ఉన్నారు. మరొకరిని తీసుకుంటారని అనుకున్నా.. ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా సీఎం జగన్ ఫ్రేమ్‌లోకి ఎవ్వరూ వెళ్లలేదు. కాకపోతే ముఖ్యమంత్రిని శంకర నారాయణ ఏవిధంగా ఇంప్రెస్ చేశారన్నదే అంతుచిక్కడం లేదట.
పంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న శంకరనారయణ ఏకగ్రీవాల పై పెద్దగా దృష్టిపెట్టలేదట..దీంతో మంత్రిగారి కి ప్రమోషన్ దక్కినా జిల్లా వైసీపీని పటిష్టం చేయడంలో మాత్రం తగిన చొరవ చూపడం లేదని సొంత కేడర్ పెదవి విరుస్తున్నారు…పార్టీ పై దృష్టి పెట్టకపోయినా మొదటిసారే మంత్రి అయినా శంకర్ నారాయణ పై జగన్ మంచి నమ్మకంతో ఉన్నారని మంత్రి గారి అదృష్టం మాములుగా లేదని చర్చించుకుంటున్నారట…..