తెలంగాణలో ఆషాడమాసం వచ్చిందంటే ఊరురా బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే.. తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. మృగశిర కార్తెలో వచ్చే ఈ బోనాలను ఇక్కడి ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కాగా, ఈ ఏడాది బోనాల వివరాలను ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గోల్కొండ బోనాలు, ఏర్పాట్లపై గోల్కొండ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జూన్ 30 నుంచి గోల్కొండ బోనాలు షురూ అవుతాయని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో బోనాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల కోసం తమ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించినట్టు తలసాని పేర్కొన్నారు. మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలకు రాష్ట్ర పండుగ హోదా లభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.