భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీవీ ఘాట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీలు పీవీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని, ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.
అంతేకాకుండా.. పీవీకి భారత రత్న ఇవ్వాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. పీవీని గౌరవించక పోవడం మంచిది కాదని, రాజకీయాలు వేరు..వ్యక్తిత్వం వేరని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ గౌరవిస్తుందని, అందుకే శత జయంతి వేడుకలు నిర్వహించిందన్నారు. కేంద్రం చిన్న చూపు చూస్తుంది ..ఇది బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.