ఆ ఘనత ఒక తెలంగాణ ప్రభుత్వానిదే : తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

-

ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువైన బోనాల చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడి మల్కాపూర్ లో గల జాంసింగ్బాలాజీ దేవాలయంలో కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని 119 దేవాలయాలకు 47 లక్షలు, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని 50 దేవాలయాలకు 18 లక్షల రూపాయల విలువైన చెక్కులను హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ చీఫ్ విప్ MS ప్రభాకర్ రావు లతో కలిసి ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని 72 దేవాలయాలకు 22 లక్షలు, మలక్ పేట డివిజన్ లోని 68 దేవాలయాలకు 16 లక్షల రూపాయల విలువైన
చెక్కులను పంపిణీ చేశారు.

May be an image of 5 people and people standing

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలు విడుదల చేయగా, 3500 కు పైగా దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో బోనాల తర్వాత ఆర్ధిక సహాయం చెక్కులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం ఈ నెల 24 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే దేవాలయాలకు ముందే చెక్కులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, పలువురు కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

బోనాల ఏర్పాట్లను ప్రశంసించిన బీజేపీ కార్పొరేటర్ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉందని, అలాంటి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేయడం పట్ల బీజేపీకి చెందిన బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ప్రశంసించారు. బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావులు వివిధ దేవాలయాలకు బోనాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ గతంలో బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రజల నుండి విరాళాలు వసూలు చేయడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఆర్ధిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేసేలా చొరవ చూపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news