Miss Diva Universe: ఈ బ్యూటీ క్వీన్‌ నచ్చిన దాని కోసం ఏమైనా చేస్తుందట!

-

‘ఉన్నది ఒక్కటే జిందగీ.. దాన్ని మనకు నచ్చినట్లుగా ఆస్వాదిస్తేనే ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతాం..’ అంటోంది ముంబయి బ్యూటీ దివితా రాయ్‌. ఈ ఏడాది ‘మిస్‌ దివా యూనివర్స్‌’గా కిరీటం గెలుచుకుందీ అమ్మడు. గతేడాది ఇదే పోటీలో రెండో రన్నరప్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మళ్లీ పోటీ పడి తన కలల కిరీటాన్ని దక్కించుకుంది. తద్వారా ఈ ఏడాది జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీలకు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించనుంది దివిత. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ క్వీన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..! మంగళూరులో పుట్టిన దివిత .. ప్రస్తుతం ముంబయిలో నివసిస్తోంది. తన తండ్రి ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆరు స్కూల్స్‌ మారింది.

ఆర్కిటెక్ట్‌.. మోడల్‌.. ముంబయిలోని ‘సర్‌ జేజే కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌’లో విద్యనభ్యసించిన దివిత.. ప్రస్తుతం వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌గా కొనసాగుతోంది. మరోవైపు మోడలింగ్‌ అన్నా ఈ ముద్దుగుమ్మకు మహా ఇష్టం. ఈ మక్కువతోనే ప్రొఫెషనల్‌ మోడల్‌గా గుర్తింపు పొంది.. పలు ఫ్యాషన్‌ వీక్స్‌లోనూ ర్యాంప్‌ వాక్‌ చేసింది. అయితే అందాల కిరీటం గెలవాలన్నది ఆమె చిరకాల కోరిక.

దివిత
దివిత

1994లో ‘విశ్వ సుందరి’గా అవతరించిన సుస్మితా సేన్‌ను స్ఫూర్తిగా తీసుకొనే ఇటువైపు వచ్చానని చెప్పింది దివిత. గతేడాది ‘మిస్‌ దివా యూనివర్స్‌/మిస్‌ యూనివర్స్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొని రెండో రన్నరప్‌గా నిలిచింది.

ఇదే పోటీల్లో హర్నాజ్‌ సంధు గెలిచి.. ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే! అయితే పట్టువదలకుండా ఈ ఏడాది కూడా ఈ పోటీల్లో పాల్గొని.. కిరీటం గెలుచుకుంది దివిత. దాంతో గతేడాది విజయం సాధించిన హర్నాజ్‌ చేతుల మీదుగా అందాల కిరీటం అలంకరించుకుందీ ముంబయి బ్యూటీ.

‘ఈ విజయం కోసమే ఇన్నాళ్లూ ఎదురుచూశా.. ఇప్పుడు వరించే సరికి నోట మాట రావట్లేదు.. ఇదో అద్భుతమైన అనుభూతి..!’అంటూ వేదికపైనే ఉబ్బితబ్బిబ్బైందీ అందాల భామ.

 

నాన్నే స్ఫూర్తి.. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యముంటుంది.. అలా తనకూ ఓ ఆశయం ఉందంటోంది దివిత. ‘మా నాన్న పడిన కష్టాలు నన్ను ఎన్నోసార్లు ఆలోచనలో పడేసేవి. ఆయన తన ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి చదువునే మార్గంగా ఎంచుకున్నారని చెబుతుంటారు.. పలు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యనభ్యసించారని అంటుంటారు. పెళ్లై తనకంటూ ఓ కుటుంబం ఏర్పడ్డాక.. మాకోసం కష్టపడ్డారు. అందుకే చదువు విషయంలో ఆయన్ని చూసి నేను స్ఫూర్తి పొందా. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నించి.. విద్యను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అని అన్నది బ్యూటీ క్వీన్‌.

అవకాశమొస్తే ఎవరిలా జీవించడానికి ఇష్టపడతారని అడిగితే.. మెక్సికన్‌ దివంగత పెయింటర్‌ ‘ఫ్రిదా కలో’లా అని చెబుతోంది దివిత. ఇక ఖాళీ సమయాల్లో పెయింటింగ్‌ వేయడానికి ఇష్టపడే ఈ ముద్దుగుమ్మకు.. బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ ఆటలంటే మక్కువట! పుస్తకాలు చదవడం, పాటలు వినడానికీ ఆసక్తి చూపుతానంటోందీ అందం.

తెలంగాణ అమ్మాయి …ఇక ఇదే పోటీల్లో ‘మిస్‌ దివా సుప్రా నేషనల్‌’ కిరీటం అందుకుంది తెలంగాణకు చెందిన ప్రజ్ఞా అయ్యగారి. హైదరాబాద్‌లో ఉండే ఆమె ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తోంది. కాలేజీలో ఉన్నప్పుడే తన మోడలింగ్‌ కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఈ ఏడాది ‘మిస్‌ ఇండియా తెలంగాణ’ కిరీటం గెలుచుకుంది. ఎప్పటికైనా పర్యావరణహితమైన ఫ్యాషన్‌ లేబుల్‌ను ప్రారంభించడమే తన లక్ష్యమంటోన్న ప్రజ్ఞకు భరతనాట్యంలోనూ ప్రవేశముంది. ఖాళీ సమయాల్లో చెస్‌ ఆడుతూ, కొరియన్‌ డ్రామాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తానంటోన్న ఈ హైదరాబాదీకి హర్నాజ్‌ సంధునే ప్రేరణట!

Read more RELATED
Recommended to you

Latest news