గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనలో 130కి పైగా మంది మృతి చెందారు. గల్లంతైన మరో 100కు పైగా మందికి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. అయితే ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
‘కనీసం ఇద్దరి ఆచూకీ లేదని మేం అంచనా వేస్తున్నాం. ఆ సంఖ్య ఎక్కువగా కూడా ఉండొచ్చు. దానిపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చాలామంది తమ బంధువులు జాడలేదని చెప్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాం. స్కూబా డైవర్లను దింపాం. నదిలో పడిన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించేందుకు సోనార్ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం’ అని స్టేట్ ఫైర్ సర్వీసెస్ చీఫ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనలో ఎన్నో లోపాలు వెలుగుచూస్తున్నాయి. వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు కోర్టుకు సమర్పించారు.