వైసీపీ తప్పులు..కళ్ళు తెరిపిస్తున్న ధర్మాన.!

-

గత కొన్ని రోజులుగా వైసీపీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బాగా హాట్ టాపిక్ అవుతున్నారు..ఆయన రాజధాని అంశంపై చేసే వ్యాఖ్యలు సెన్సేషనల్ అవుతున్నాయి..కావాలని చేస్తున్నారో లేక..ఉన్నదే చెబుతున్నారో తెలియదు గాని..ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మొదట నుంచి మూడు రాజధానుల కోసం గళం విప్పుతున్న ధర్మాన..ఇటీవల మూడు కాదు ఒకటే రాజధాని అని, అది కూడా విశాఖ అని బాంబ్ పేల్చారు. జగన్ ఏమో మూడు రాజధానులు అని మూడు ప్రాంతాలని కవర్ చేస్తున్నారు.

కానీ పరిపాలన ఎక్కడ నుంచి నడిస్తే అదే రాజధాని అని, కాబట్టి విశాఖనే రాజధాని అని, కేవలం అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో, హైకోర్టు కర్నూలులో ఉంటుందని, ఆ మాత్రం అవి రాజధానులు కావనే కాన్సెప్ట్ ధర్మాన చెబుతున్నారు. తాజాగా కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేశారు. ఏటా మూడుసార్లు అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతి వెళ్తామని, హైకోర్టు కోసం కర్నూలు వెళ్తామని, తమ ప్రాంతం నుంచి ఒక్క శాతం జనం కూడా హైకోర్టుకు వెళ్లరని చెప్పారు.

అంటే దీని ద్వారా వైసీపీ మూడు రాజధానులు అంటూ ఇటు కోస్తా, అటు రాయలసీమ ప్రజలని మోసం చేస్తుందనే విధంగా ధర్మాన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కొత్త సంస్కరణలని ప్రజలు అర్ధం చేసుకోవడం లేదని తాజాగా గడపగడపకు కార్యక్రమంలో ధర్మాన అన్నారు. ఇక రోడ్లపై గుంతలు కామన్ అని, టి‌డి‌పి హయాంలోనే గుంతలు పడ్డాయని, అవి ఇప్పుడు పెద్దవి అయ్యాయని చెప్పారు.

అయితే ధర్మాన ఏదో అనుకుని..ఇంకా ఏదో చేసినట్లు కనిపిస్తోంది. ధర్మాన చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే తమ ప్రభుత్వం తప్పులు చేస్తుందని, వ్యతిరేకత ఉందని స్పష్టంగా అర్ధమవుతుంది. అంటే ధర్మాన వ్యాఖ్యల ప్రభావం వల్ల వైసీపీకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news