బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏ బ్యాంకు, ఏ సంస్థ, ఏ ఏజెన్సీల వద్ద ఎంత అప్పు తీసుకున్నారు.., ఏ తారీఖునా అప్పు తీర్చారు.., అసలు, వడ్డీ ఎంత.. మొత్తం ఎంత బాకీ చెల్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.86 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.80 వేల కోట్లు అప్పు తీసుకొచ్చినట్లు ఆర్ధిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలిపారని ఆయన వెల్లడించారు. పార్టమెంట్ లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రం రూ.3.68లక్షల కోట్లు అప్పుల్లో ఉందని దేశ అర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తీర్చింది నిజమే అయితే రాష్ట్రానికి ఉన్న అప్పు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు తీర్చగా మిగిలిన అప్పు మొత్తంపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేని పక్షంలో వచ్చే ఆగస్టు 11 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.