రేపు ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

-

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే.. ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. ఈ నెల 16న గుండెనొప్పితో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరారు. హృద్రోగ సమస్యలతో పాటు.. మధుమేహం వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యేను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని.. కార్డియాక్‌ అరెస్ట్‌ రావడంతో.. గుండె పనితీరు ఆగి.. మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితమే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేశారని పేర్కొన్నారు.

సాయన్న మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి కుటుంబసభ్యులు తరలించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఎమ్మెల్యే సాయన్న మృతికి మంత్రి కేటీఆర్‌, ఇతర బీఆర్​ఎస్​ నేతలు సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయన్న మృతితో పలువురు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. అయితే.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి రేపు మధ్యాహ్నం బన్సిలాల్‌పేట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు ఉదయం అయన నివాసం నుంచి.. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంచనున్నారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం మూడు గంటలపాటు పార్థివదేహాన్ని క్యాంపు కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఆ తర్వాత బన్సిలాల్‌పేట శ్మశాన వాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news